DK Aruna: దేశ సరిహద్దుల గురించి కేసీఆర్ మాట్లాడటం దారుణం: డీకే అరుణ
- సర్జికల్ స్ట్రయిక్స్ పై కేసీఆర్ ఆధారాలు అడగడం దారుణం
- భారత సైన్యం విశ్వసనీయత దెబ్బతినేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు
- కేసీఆర్ వ్యాఖ్యలు శత్రు దేశాలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి
సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై ఆధారాలు చూపాలని కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దేశ సరిహద్దుల్లో అలజడులు రేగుతున్నాయని ఆయన అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.
సర్జికల్ స్ట్రయిక్స్ పై కేసీఆర్ ఆధారాలు అడగడం దారుణమని డీకే అరుణ అన్నారు. అసలు మీరు భారతీయులేనా? అని ఆమె ప్రశ్నించారు. జాతీయ మీడియాలో ప్రచారం కోసం... భారత సైన్యం విశ్వసనీయతను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దేశ సరిహద్దుల వద్ద అలజడులు రేగుతున్నాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు... శత్రు దేశాలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై ఇండియన్ ఆర్మీ చీఫ్, వాయుసేన చీఫ్ లు ప్రకటన చేసిన తర్వాత... దేశంలోని ప్రతి ఒక్కరూ ఆ మాటకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు.