Chandrababu: ఓటు అమ్ముకుని బతికే జీవితం ఎందుకన్న వృద్ధురాలి వీడియో వైరల్.. అభినందిస్తూ ట్వీట్ చేసిన చంద్రబాబు
- బతికి ఉన్నందుకే ఓటు వేస్తున్నాం
- చనిపోతే ఓటు వేయగలమా?
- ఫలానా వ్యక్తి భార్య పింఛను కోసం వెళ్తుందంటే మా నాన్నకు చెడ్డపేరు
- నీకు ధన్యవాదాలమ్మా.. అంటూ వీడియో షేర్ చేసిన చంద్రబాబు
ఓటు విలువ గురించి చెబుతున్న ఓ వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఓటును అమ్ముకుని బతికే జీవితం కూడా జీవితమేనా? మనం బతికి ఉన్నందువల్లే ఓటు వేస్తున్నాం. చనిపోతే వేయగలమా? అందుకే ఓటు అమ్ముకోకూడదు. కష్టం చేసుకుని తిందాం. కష్టం చేతకానప్పుడు దైవం ఎలా రాసిపెడితే అలానే జరుగుతుంది’’ అని ఆ వీడియోలో వృద్ధురాలు చెప్పుకొచ్చింది.
‘‘నేను పింఛను వద్దనుకున్నా. నాకు కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. కష్టం చేసుకుని తింటాను. అప్పట్లో మా నాన్న పదిమందికి పెట్టినోడు. ఇప్పుడు నేను పింఛను కోసం వెళ్తే చూసినోళ్లు ఏమనుకుంటారు? ఫలానా వ్యక్తి బిడ్డ పింఛను కోసం వెళ్తుందంటే మా నాన్నకు చెడ్డపేరు వస్తుంది. అందుకే నాకు పింఛను వద్దు. ఓటుకు డబ్బులిచ్చినా తీసుకోను. కానీ ఓటేసి వస్తా. ఈసారి ఒక పార్టీకి, మరోసారి మరో పార్టీకి ఓటు వేయడం నాకు చేతకాదు’’ అంటూ ఆ అవ్వ చెప్పిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ వీడియో తిరిగితిరిగి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడింది. వెంటనే ఆయన ట్విట్టర్లో స్పందించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆమె సందేశాన్ని అందించాలని అనిపించిందని పేర్కొన్నారు. ఇలాంటి అభ్యుదయ భావాలున్న ఆమె తెలుగుదేశం పార్టీ అభిమాని అయినందుకు గర్వంగా ఉందని, ఆమెకు అభినందనలు అని చంద్రబాబు పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేశారు.