Russia: మా దేశంపై రేపు రష్యా దాడి చేస్తుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన
- మాకు సమాచారం అందింది
- దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి
- రేపు ఐక్యతా దినోత్సవం జరుపుకోవాలి
- ఫేస్బుక్లో తెలిపిన వొలోదిమిర్ జెలన్ స్కీ
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీ ఎత్తున రష్యా బలగాలను మోహరించడం, ఆ దేశంలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధం కావడం వంటి పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు ఉందని ఇప్పటికే అమెరికా కూడా హెచ్చరించింది.
తాజాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ కూడా ఇదే విషయాన్ని తెలుపుతూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. రేపు (బుధవారం) ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు సమాచారం అందినట్లు చెప్పారు. దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని రేపు ఐక్యతా దినోత్సవం జరుపుకోవాలని సూచించారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని పశ్చిమాన ఉన్న లివివ్ నగరానికి తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తెలిపారు. తాత్కాలికంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య రష్యా బలగాల మోహరింపు కారణంగా తమ దేశ అధికారుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కాగా, రష్యా ఇప్పటికే సరిహద్దుల్లో లక్షకు పైగా సైనిక బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. దీనిపై నాటో దేశాలు అప్రమత్తమయ్యాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడానికి సిద్ధమైందని అమెరికా పలుసార్లు ప్రకటించింది. అయితే, అమెరికా ప్రకటనను రష్యా మాత్రం కొట్టిపారేస్తోంది. రష్యా దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరిస్తోంది. అయినప్పటికీ, ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా తమ బలగాలను భారీగా మోహరిస్తోంది. బెలారస్లో ఉక్రెయిన్ సరిహద్దులకు 25 కిలోమీటర్ల దూరంలో భారీగా రష్యా దళాలు ఉన్నాయి.
రష్యా దళాలు ఉక్రెయిన్ను ఉత్తర, తూర్పు, దక్షిణ దిశల నుంచి చుట్టుముడుతున్నాయి. రష్యాను సమర్థంగా అడ్డుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా ఆక్రమించుకున్న క్రిమియా సరిహద్దుల సమీపంలో ఉక్రెయిన్ దళాలు ఇప్పటికే కవాతు నిర్వహించాయి. ఇందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు సైనిక దుస్తుల్లో పాల్గొన్నారు. ఇప్పటికే అక్కడి పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోనులో మాట్లాడారు.
నాటోతో ఉక్రెయిన్ చాలా ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తుండడంతో ఆ కూటమిలోని దేశాలు ఉక్రెయిన్‌కు సాయంగా నిలుస్తున్నాయి. అధికారికంగా నాటోలో ఇంతవరకు ఉక్రెయిన్ చేరకపోయినప్పటికీ ఆ దేశానికి ఆ కూటమి రక్షణగా నిలుస్తోంది. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ అనేక ప్రయత్నాలూ చేస్తోంది.