India: రేపు తమ దేశంపై రష్యా దాడి చేస్తుందన్న ఉక్రెయిన్ ప్రకటనతో భారత్ అప్రమత్తం.. అక్కడి భారతీయులకు సూచనలు
- ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వచ్చేయాలి
- ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రకటన
- రేపు ఉక్రెయిన్ పై దాడి జరగనుందన్న అమెరికా కూడా ఇప్పటికే ప్రకటన
రేపు (బుధవారం) ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు సమాచారం అందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వచ్చేయాలని పేర్కొంది.
ప్రధానంగా ఉక్రెయిన్లో ఉండడం తప్పనిసరికాని భారతీయులు వెంటనే భారత్ వచ్చేయాలని సూచించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదలయింది. రేపు ఉక్రెయిన్పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.