Russia: ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని దళాలను ఉపసంహరించుకున్న రష్యా
- ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు
- కదనోత్సాహంతో రష్యన్ సేనలు
- విన్యాసాలు పూర్తయిన దళాలు వెనక్కి వచ్చాయన్న రష్యా ప్రభుత్వం
ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణాన అయినా విరుచుకుపడొచ్చని అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా కొన్ని దళాలను ఉపసంహరించుకుంది. రష్యా చర్య వెనుక కారణం ఏంటో తెలియరాలేదు. దీనిపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. సరిహద్దుల్లో విన్యాసాలు పూర్తయ్యాయని, అందుకే కొన్ని దళాలను వెనక్కి పిలిపించామని వెల్లడించింది.
కాగా, రేపు తమ దేశంపై రష్యా దాడికి దిగుతుంది అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలన్ స్కీ సోషల్ మీడియాలో ప్రకటన చేయడం తీవ్ర కలకలం రేపింది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే అంచనాతో ఉంది. బుధవారం రష్యా బలగాలు ఉక్రెయిన్ పై దాడి చేసే అవకాశం ఉందని పెంటగాన్ అనుమానిస్తోంది.
ఇప్పటివరకు రష్యా లక్ష మంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకు తరలించినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు వారిలో చాలామందిని ఉపసంహరించుకున్నట్టు సమాచారం. మరి ఇది దేనికి సంకేతం అన్నది స్పష్టం కాలేదు.
కాగా, యుద్ధ మేఘాలు ముసురుకుంటున్న నేపథ్యంలో, అనేక దేశాలు తమ పౌరులను ఉక్రెయిన్ నుంచి వచ్చేయాలని సూచిస్తున్నాయి. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఉక్రెయిన్ లో ఉండొద్దని భారత్ కూడా పౌరులకు స్పష్టం చేసింది.