Rahul Gandhi: కేజ్రీవాల్ లాంటి వాళ్లు టెర్రరిస్టుల ఇళ్లలో ఉండడానికి కూడా వెనుకాడరు: రాహుల్ గాంధీ
- ఆదివారం నాడు పంజాబ్ లో ఎన్నికలు
- ముదిరిన మాటల యుద్ధం
- కాంగ్రెస్ వర్సెస్ ఆప్
- 2017 నాటి ఘటనను ప్రస్తావించిన రాహుల్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఆదివారం (ఫిబ్రవరి 20) పంజాబ్ లో ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 'ఆప్' అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ వంటి నేతలు టెర్రరిస్టుల ఇళ్లలోనూ ఉండేందుకు వెనుకాడరని వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎవరూ టెర్రరిస్టుల ఇళ్లలో కనిపించరని రాహుల్ స్పష్టం చేశారు.
2017 ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తాన్ మాజీ ఉగ్రవాది ఇంట్లో ఓ రాత్రి బస చేశారు. ఈ అంశాన్ని రాహుల్ ఎత్తిచూపారు. ఇలాంటి నేతలను నమ్ముకుంటే, టెర్రరిస్టులతో మెతక వైఖరి అవలంబించి జాతీయ భద్రతను తాకట్టు పెడతారని విమర్శించారు. ఒక్క చాన్స్ అంటున్నారని, కానీ చీపురుకట్ట పార్టీ (ఆప్) వాళ్లకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని, పంజాబ్ కాలిబూడిదవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.