Ashish Mishra: రైతుల పైకి కారు పోనిచ్చిన కేసులో కేంద్రమంత్రి తనయుడు జైలు నుంచి విడుదల
- గతేడాది అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో ఘటన
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన
- రైతుల పైకి దూసుకెళ్లిన కారు
- నలుగురు రైతులు సహా 8 మంది మృతి
- కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ పై ఆరోపణలు
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో నిరసనలు తెలుపుతున్న రైతుల పైకి కారుతో దూసుకెళ్లిన కేసులో జైలులో వున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా నిన్న విడుదలయ్యారు. లఖింపూర్ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి గత వారం అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, లాంఛనాలు పూర్తయిన పిమ్మట నిన్న ఆశిష్ మిశ్రా జైలు నుంచి వెలుపలికి వచ్చారు. అయితే, ఇతర ఖైదీల మాదిరిగా కాకుండా జైలు వెనుక నుంచి ఓ ఎస్ యూవీలో వెళ్లిపోయారు.
మిశ్రా విడుదలపై ఆయన న్యాయవాది అవదేశ్ కుమార్ మాట్లాడుతూ, ఒక్కొక్కటి రూ.3 లక్షల చొప్పున కోర్టు రెండు పూచీకత్తులు అడిగిందని తెలిపారు. నగరం విడిచి వెళ్లడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని వెల్లడించారు.