Karnataka: హిజాబ్ లేకుండా రావాలన్న ప్రిన్సిపాల్.. గేటు బయట విద్యార్థినుల నిరసన.. భారీగా పోలీసుల మోహరింపు
- విజయపుర గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత
- న్యాయం చేయాలంటూ విద్యార్థినుల నినాదాలు
- హైకోర్టు ఉత్తర్వులనే అనుసరిస్తున్నామన్న ప్రిన్సిపాల్
కర్ణాటకలో హిజాబ్ వివాదం మరింత ముదురుతోంది. హిజాబ్ వేసుకుంటే లోపలికి రానిచ్చేది లేదని ఉత్తర కర్ణాటక, విజయపురలోని గవర్నమెంట్ పీయూ కాలేజ్ తేల్చి చెప్పింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఎవరినీ హిజాబ్ తో అనుమతించేది లేదని కాలేజీ ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. ఎలాంటి మతపరమైన వస్త్రధారణకు అనుమతి లేకుండా విద్యాసంస్థలను నడపాలన్న హైకోర్టు ఉత్తర్వులనే తాము అనుసరిస్తున్నామని తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థులంతా కాలేజీ బయట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
విద్యార్థులు బుర్ఖాలు, హిజాబ్ లతో కాలేజీలోకి ప్రవేశించడంతో టీచర్లు, ప్రిన్సిపాల్ వాళ్లను ఆపేశారు. హిజాబ్ లు లేకుండా క్లాసు రూంలోకి వెళ్లాలని వారికి సూచించారు. హిజాబ్ లు, బుర్ఖాలు వదిలి వచ్చేందుకు ప్రత్యేక గదిని కూడా కేటాయించారు. అయితే, వారి మాటలను విద్యార్థినులు వినలేదు. ఈ నేపథ్యంలోనే కాలేజీ గేటు బయట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాగా, కాలేజీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కొందరు మహిళా పోలీసులనూ అక్కడ భద్రతగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.