Bonda Uma: అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ చేయని ప్రయత్నమంటూ లేదు: బొండా ఉమ ఆరోపణలు
- అవినాష్ ను కాపాడేందుకు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో లెక్కే లేదు
- అడ్డంగా దొరికినా బుకాయిస్తున్నారు
- కేసును సీబీఐ సగమే వెలికి తీసిందన్న ఉమ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ ను సీబీఐ విచారించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డేనని తేల్చి చెప్పారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించాల్సిందిపోయి.. నిందితుల మీద సీబీఐ విచారణను జగన్ ఉపసంహరించారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్.. ఇప్పుడెందుకు వద్దంటున్నారని నిలదీశారు.
వివేకా హత్య కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. ఆయన్ను కాపాడేందుకు జగన్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో లెక్కేలేదన్నారు. హత్య జరిగిన రోజు నుంచి జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
సాక్ష్యాలు దొరకకుండా నిందితులు జాగ్రత్త పడ్డారని, హత్యకు సంబంధించి సీబీఐ సగం కేసునే వెలికి తీసిందని చెప్పారు. అవినాష్ రెడ్డి నాటకాలాడి తమపై విషప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వివేకా హత్యను గెలుపు కోసం వాడుకున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే కేసును తప్పుదోవ పట్టించారన్నారు. హత్యలో వైసీపీ నేతల ప్రమేయమున్నా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.