Gujarat: 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్‌ను వదిలేశాడు.. ఇప్పుడు మళ్లీ చదువుతాడట!

Gujarat High Court Pulls Up Man For Seeking Readmission to MBBS Course after 30 Years

  • గుజరాత్‌లో ఘటన
  • 1988లో రెండో ఏడాది ఎగ్జామ్ రాసి వదిలేసిన వ్యక్తి
  • ఇప్పుడు రీ అడ్మిషన్ కోసం కోర్టులో పిటిషన్
  • ప్రజల జీవితాలతో ఆడుకోవాలని అనుకుంటున్నారా? అని కోర్టు ఆగ్రహం
  • పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా తోచిపుచ్చిన వైనం

ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం పక్కనపెట్టేసిన ఎంబీబీఎస్ విద్యను మళ్లీ పూర్తిచేయాలన్న ఆలోచన వచ్చిందో వ్యక్తికి. అయితే, అతడి ఆశలను కోర్టు వమ్ముచేసింది. రీ అడ్మిషన్ ఇప్పించాలంటూ ఆ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అంతేకాదు, ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. గుజరాత్‌లో జరిగిందీ ఘటన.

వైద్య విద్యను మళ్లీ అభ్యసించాలని కోరుకుంటున్న ఆ వ్యక్తి పేరు కందీప్ జోషి. వయసు 50 సంవత్సరాలు. ప్రస్తుతం ఓ వ్యాపారంలో ఉన్నాడు. 1988లో బరోడా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతూ రెండో ఏడాది పరీక్షలు రాశాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇప్పుడు మళ్లీ ఆయనకు ఎంబీబీఎస్‌పై మనసు మళ్లింది. అదే కాలేజీలో మూడో సంవత్సరం పరీక్షలు రాయాలని భావించాడు. ఇందుకు కోసం తనకు రీ అడ్మిషన్ ఇప్పించాలంటూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.

పిటిషన్‌ను విచారించిన జస్టిస్ భార్గవ్ డి కరియా నేతృత్వంలోని ధర్మాసనం.. ఆగిపోయిన ఎంబీబీఎస్‌ను ఈ వయసులో ఎందుకు కొనసాగించాలని కోరుకుంటున్నారని, ప్రజల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. రీ ఎడ్మిషన్ కోసం ఎలాంటి నియమాలు లేవని అనుకున్నా, ఇష్టానుసారం ప్రవర్తించడం కుదరదని, మరీ ముఖ్యంగా ప్రజల జీవితాలతో ఆడుకోవాలనుకోవడం కుదరదని చెబుతూ పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

‘‘అసలు ఏమనుకుంటున్నారు? దీని తర్వాత ఏం సాధించాలనుకుంటున్నారు? 50 ఏళ్ల వయసులో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా? ఇదసలు సాధ్యమేనా?  మీకెంతమంది పిల్లలు? 50 ఏళ్ల వయసులో మీ పిల్లలు ఎంబీబీఎస్ చదవాలి. కానీ ఇప్పుడు మీ పిల్లలతో కలిసి కోర్సు పూర్తిచేయాలనుకుంటున్నారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి రీ అడ్మిషన్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News