Chitra Ramakrishna: నేషనల్ స్టాక్ ఎక్చేంజి మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ ఇంటిపై ఐటీ దాడులు... తెరపైకి 'హిమాలయ యోగి' అంశం

IT raids on NSE former CEO Chitra Ramakrishna

  • చిత్రా రామకృష్ణ అవకతవకలపై సెబీ దర్యాప్తు
  • నిబంధనలు ఉల్లంఘించినట్టు నిర్ధారణ
  • రూ.3 కోట్ల జరిమానా
  • హిమాలయ యోగి చేతిలో చిత్రా పావులా మారారని వ్యాఖ్య  

నేషనల్ స్టాక్ ఎక్చేంజి (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత వంటి కారణాలతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. చిత్రా రామకృష్ణ 2009లో నేషనల్ స్టాక్ ఎక్చేంజీలో జేఎండీగా నియమితులయ్యారు. 2013లో స్టాక్ ఎక్చేంజీకి సీఈవో అయ్యారు. అనూహ్యరీతిలో 2016లో పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే చిత్రా రామకృష్ణ పదవీకాలంలో కొన్ని నియామకాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. స్టాక్ ఎక్చేంజి చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ గా ఆనంద్ సుబ్రమణియన్ ను నియమించడం, ఆపై అతడిని గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం వివాదాస్పదం అయ్యాయి. దీనిపై సెబీ విచారణ కూడా చేపట్టింది. ఈ క్రమంలో హిమాలయ యోగి అంశం తెరపైకి వచ్చింది.

ఆ హిమాలయ యోగి ఎంత చెబితే అంత అన్నట్టు చిత్రా రామకృష్ణ నడుచుకున్నారన్న విషయం వెల్లడైంది. చిత్రాపై సదరు హిమాలయ యోగి ప్రభావం తీవ్రస్థాయిలో ఉండేదని, ఆ యోగి సిఫారసుల మేరకే ఆమె కొన్ని నియామకాలు చేపట్టారన్న విషయం దర్యాప్తుల్లో తేలింది. ఎలాంటి అనుభవం లేని వ్యక్తిని స్టాక్ ఎక్చేంజి ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమించినట్టు తెలిసింది.

అంతేకాదు, ఎంతో కీలక, రహస్య సమాచారాన్ని సైతం చిత్రా రామకృష్ణ ఆ హిమాలయ యోగితో పంచుకున్నట్టు సెబీ వెల్లడించింది. కాగా, చిత్రా రామకృష్ణ అతిక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారించిన సెబీ ఆమెకు రూ.3 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. అంతేకాదు, మూడేళ్ల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం వేటు వేసింది.

దీనిపై చిత్రా రామకృష్ణ స్పందించారు. ఆ హిమాలయ యోగి తనకు గత రెండు దశాబ్దాలుగా మార్గదర్శనం చేస్తున్నారని, వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాల్లో దారి చూపించారని తెలిపారు. ఆయనను ఆమె 'శిరోన్మణి' అని పేర్కొన్నారు. అయితే, సెబీ మాత్రం చిత్రా రామకృష్ణను ఆ హిమాలయ యోగి ఓ పావులా ఉపయోగించుకున్నారని ఆరోపిస్తోంది.

  • Loading...

More Telugu News