Yash Dhull: తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ బాదిన టీమిండియా అండర్-19 కెప్టెన్... నెటిజన్ల నీరాజనాలు
- నేటి నుంచి రంజీ ట్రోఫీ
- గువాహటిలో ఢిల్లీ వర్సెస్ తమిళనాడు
- ఢిల్లీ ఓపెనర్ గా బరిలో దిగిన యశ్ ధూల్
- 150 బంతుల్లో 113 పరుగులు
- ఇటీవల వరల్డ్ కప్ నెగ్గిన భారత అండర్-19 జట్టు
- కెప్టెన్ గా వ్యవహరించిన యశ్ ధూల్
ఇటీవల భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ గెలవడం తెలిసిందే. ఆ టోర్నీలో టీమిండియా అండర్-19 జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ యశ్ ధూల్ నేడు రంజీల్లో అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో తొలి రంజీ మ్యాచ్ ఆడుతున్న యశ్ ధూల్ ఢిల్లీ తరఫున బరిలో దిగాడు. తమిళనాడుపై సెంచరీ సాధించి జాతీయస్థాయిలో ఆకట్టుకున్నాడు.
ఎలైట్ గ్రూప్-హెచ్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్ గువాహటిలో జరుగుతోంది. ఓపెనర్ గా బరిలో దిగిన యశ్ ధూల్ మొత్తం 150 బంతులు ఆడి 113 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 18 బౌండరీలు ఉన్నాయి.
కెరీర్ తొలి రంజీ మ్యాచ్ లోనే శతకంతో సత్తా చాటడం పట్ల సోషల్ మీడియాలో అతడిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. యశ్ ధూల్ టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ అవుతాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. బీసీసీఐ కూడా అతడిని అభినందించింది. సెంచరీ పూర్తయినప్పటి వీడియోను పంచుకుంది.
కాగా, కరోనా కారణంగా తీవ్ర జాప్యం జరిగిన దేశవాళీ క్రికెట్ టోర్రీ రంజీ ట్రోఫీ నేటి నుంచి షురూ అవుతోంది. దేశవ్యాప్తంగా పలు వేదికల్లో లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.