YV Subba Reddy: ఇక తిరుమల కొండపై హోటళ్లు ఉండవు... భక్తులకు టీటీడీనే భోజనం అందిస్తుంది: వైవీ సుబ్బారెడ్డి
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- నిర్ణయాలు వెల్లడించిన వైవీ సుబ్బారెడ్డి
- కొండపై ప్రైవేటు హోటళ్లను తొలగిస్తామని వెల్లడి
- తిరుమల వ్యాప్తంగా అన్న వితరణ ఉంటుందని వివరణ
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు తిరుమల అన్నమయ్య భవన్ లో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇకపై తిరుమల కొండపై హోటళ్లు ఉండవని తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో ప్రైవేటు హోటళ్లను తొలగిస్తామని అన్నారు. తిరుమల వచ్చే భక్తులకు టీటీడీనే ఉచితంగా అన్న ప్రసాదం అందజేస్తుందని చెప్పారు.
సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరికీ ఒకటే ఆహారం లభిస్తుందని స్పష్టం చేశారు. హోటళ్లు లేకుండా, భక్తులకు భోజనం అందించేందుకు టీటీడీ తగిన చర్యలు తీసుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో మరిన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాద వితరణ కోసం ఏర్పాట్లు చేస్తామని, భారీ ఎత్తున అన్న ప్రసాదం తయారీకి సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతామని చెప్పారు.