Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ కనీస ధర రూ. 40.. వారం రోజుల్లో ఉత్తర్వులు!
- మూడు శ్లాబుల్లో టికెట్ ధరలు
- గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40, పట్టణ ప్రాంతాల్లో రూ. 70
- బడ్జెట్ రూ 100 కోట్లు దాటితే టికెట్ ధరలు ఎలా ఉండాలన్న దానిపైనా చర్చ
- ప్రజలను, సినీ పరిశ్రమను సంతృప్తి పరిచేలా నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి త్వరలోనే ఫుల్‌స్టాప్ పడేలా కనిపిస్తోంది. సినిమా టికెట్ల ధరలపై ఏర్పాటైన కమిటీ నిన్న సచివాలయంలో సమావేశమై టికెట్ ధరలు ఏ మేరకు పెంచాలన్న దానిపై చర్చించింది.
అనంతరం ఫిలిం చాంబర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్ విలేకరులతో మాట్లాడుతూ.. మూడు శ్లాబుల్లో టికెట్ ధరలు ఉంటాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ కనీస ధర రూ. 40గా, పట్టణ ప్రాంతాల్లో రూ. 70కి దగ్గరగా ఉండేలా చూడాలని సూచించినట్టు చెప్పారు. ప్రభుత్వం దీనికి కాస్తంత అటూఇటుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి మరో వారం, పది రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు.
సినిమా వ్యయం రూ. 100 కోట్లు దాటినప్పుడు టికెట్ ధరలు ఎలా ఉండాలన్న దానిపైనా చర్చించినట్టు చెప్పారు. అలాగే, ఐదో షోపైనా చర్చ జరిగిందన్నారు. చిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సినిమా హాళ్లలో టికెట్ ధరకంటే తినుబండారాల ధరలే ఎక్కువన్న దానిపైనా చర్చించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్, సినీ నటుడు చిరంజీవి భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపైనా చర్చ జరిగిందన్నారు. కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, ప్రజలను, సినిమా పరిశ్రమను సంతృప్తి పరిచేలా నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
థియేటర్లను ఏసీ, నాన్ ఏసీ, ఎయిర్ కూల్ వారీగా విభజిస్తారని తెలుగు ఫిలిం చాంబర్స్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ తుమ్మల సీతారాంప్రసాద్ అన్నారు. జీఎస్టీ, విద్యుత్ చార్జీలు పంచాయతీలు, నగరాల్లోనూ ఒకేలా ఉండడంతో అందుకు అనుగుణంగా టికెట్ ధరలు ఉంటాయని పేర్కొన్నారు.