Brazil: బ్రెజిల్‌లో వరదలు.. 94 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు
- వరదలతో పెట్రోపోలిస్ నగరం అతలాకుతలం
- మట్టి చరియల కింద మరింత మృతదేహాలు
- మూడు గంటల్లోనే 25.8 సెంటీమీటర్ల వర్షపాతం
- 1932 తర్వాత ఇదే తొలిసారి
బ్రెజిల్‌లో సంభవించిన వరదల్లో 94 మంది మరణించారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. జర్మన్ ప్రభావం ఉన్న పెట్రోపోలిస్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున నివాస ప్రాంతాలపై వరదలు, మట్టిచరియలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 94 మంది మరణించినట్టు రియో డి జనేరో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరో 35 మంది వరకు ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తున్నా.. కచ్చితమైన సంఖ్య తెలియదని మేయర్ రూబెన్స్ బోంటెంపో తెలిపారు.
మట్టిచరియల కింద మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ వారి కోసం గాలిస్తున్న వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఈ ప్రాంతం విషాదంగా మారింది. మూడు గంటల్లోనే ఏకంగా 25.8 సెంటీమీటర్ల వర్షం కురవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. 1932 తర్వాత ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు. వీధుల్లో కార్లు గుట్టలుగా పడివున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.