Corona Virus: కొవిడ్ బాధితుల్లో ఏడాదిపాటు కుంగుబాటు, నిద్రలేమి: అమెరికా శాస్త్రవేత్తలు
- ప్రపంచ వ్యాప్తంగా 1.48 మందిలో సమస్యలు
- ఒక్క అమెరికాలోనే 28 లక్షల మంది
- కరోనా సోకని వారితో పోలిస్తే బాధితుల్లో 60 శాతం ఎక్కువ ముప్పు
కరోనా వైరస్ బాధితులపై అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. కరోనా నుంచి బయటపడ్డామన్న సంబరం లేకుండా ఏడాది పాటు అది వేధిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వచ్చి తగ్గిన తర్వాత బాధితుల్లో కుంగుబాటు, నిద్రలేమి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఏడాది పాటు వేధిస్తున్నట్టు వెల్లడైందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా 1.48 కోట్ల మంది ఈ సమస్యల బారినపడినట్టు చెప్పారు. ఒక్క అమెరికాలోనే వీరి సంఖ్య 28 లక్షల వరకు ఉన్నట్టు గుర్తించారు.
మార్చి 2020- జనవరి 2021 మధ్య కరోనా సోకిన 58 లక్షల మంది, అదే సమయంలో కొవిడ్ బారిన పడని మరో 58 లక్షల మంది ఆరోగ్యంపై పరిశోధనలు జరిపారు. వైరస్ సోకని వారితో పోలిస్తే కొవిడ్ బాధితుల్లో మానసిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం 60 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే, ప్రతి వెయ్యిమంది కొవిడ్ బాధితుల్లో 24 మంది నిద్రలేమి, 15 మంది కుంగుబాటు, 11 మంది గ్రహణశక్తి లోపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త, ఎపిడెమియాలజిస్ట్ జియాద్ అల్ అలీ తెలిపారు.