Tirumala: ముంబైలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం టీటీడీకి భూమిని కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం!
- దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్న టీటీడీ
- ముంబైలోని బాంద్రా ప్రాంతంలో భూమిని కేటాయించిన మహా ప్రభుత్వం
- గత ఏడాది 62 ఎకరాల భూమిని ఇచ్చిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయాలను దేశ వ్యాప్తంగా టీటీడీ నిర్మిస్తోంది. దీని కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీకి భూములను విరాళంగా ఇస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో జమ్ము జిల్లాలో 62 ఎకరాల భూమిని టీటీడీకి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది.
ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గాను టీటీడీకి భూమిని కేటాయించింది. ముంబైలో అత్యంత కీలకమైన బాంద్రా ప్రాంతంలో భూమిని అందించింది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కావాల్సినవన్నీ సమకూర్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆలయ నిర్మాణానికి భూమి అందించిన థాకరేకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,096.40 కోట్ల వార్షిక బడ్జెట్ కు టీటీడీ పాలకమండలి ఆమోదముద్ర వేసింది.