Salman Butt: ధోనీ కెప్టెన్ గా వచ్చినా బంగ్లాదేశ్ వరల్డ్ చాంపియన్ కాలేదు...ఇదీ అంతే!: పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు
- పీఎస్ఎల్ లో కరాచీ కింగ్స్ దారుణ ప్రదర్శన
- ఒక్క విజయం సాధించలేక ఆపసోపాలు
- కెప్టెన్ బాబర్ అజామ్ పై విమర్శలు
- బాబర్ కు మద్దతుగా మాట్లాడిన సల్మాన్ భట్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్) పోటీల్లో కరాచీ కింగ్స్ పేలవ ప్రదర్శనపై స్పందించాడు. పాకిస్థాన్ జాతీయ జట్టు సారథి బాబర్ అజామ్ పీఎస్ఎల్ లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. పీఎస్ఎల్ తాజా సీజన్ లో కరాచీ జట్టు ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేకపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు చేతిలోనూ ఓటమిపాలైంది. దాంతో కెప్టెన్ బాబర్ అజామ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, మాజీ కెప్టెన్ సల్మాన్ భట్... బాబర్ అజామ్ కు మద్దతుగా మాట్లాడాడు. "కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ ను మార్చాల్సి ఉంటుందని నేను భావించడంలేదు. బాబర్ పాకిస్థాన్ జాతీయ జట్టుకు కూడా కెప్టెన్. మీరు ఎంఎస్ ధోనీని లేక రికీ పాంటింగ్ ను బంగ్లాదేశ్ కెప్టెన్ గా చేసినా ఆ జట్టు వరల్డ్ చాంపియన్లు కాలేదు. ఇప్పుడు కరాచీ కింగ్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కెప్టెన్సీ మార్పు దీనికి పరిష్కారం అనుకోవడంలేదు. కొంత మార్పు రావాల్సి ఉంది... అందుకు కొంచెం ఓర్పు అవసరం.
ఫ్రాంచైజీ క్రికెట్లో జట్టులో సమతూకం లేకపోతే ఏమంత గొప్ప ప్రదర్శన చేయలేం. పీఎస్ఎల్ తాజా సీజన్ ప్రారంభానికి కేవలం వారం ముందే కరాచీ కింగ్స్ ఆటగాళ్లను బాబర్ కలిశాడు. జట్టులో స్పెషలిస్టులు లేకపోతే మీరెంత గొప్ప వ్యూహకర్తలు అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు" అని సల్మాన్ భట్ వ్యాఖ్యానించాడు.