Undavalli Arun Kumar: జగన్, చంద్రబాబు ఇలాగే కొట్టుకుంటూ ఏపీకి అన్యాయం చేస్తారా?: ఉండవల్లి అరుణ్ కుమార్
- ఏపీ విభజన సరిగా జరగలేదంటే కేసీఆర్ కు కోపం ఎందుకు?
- రాష్ట్ర విభజనపై 2013లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను
- రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆలోచించరా? అని నిలదీత
- రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై జగన్ నోరు మెదపకపోవడం దారుణమన్న ఉండవల్లి
ఏపీ విభజన నిబంధనల ప్రకారం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుంటారా? అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఏపీ విభజన సరిగా జరగలేదంటే కేసీఆర్ కు కోపం ఎందుకని అన్నారు. విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ మాట్లాడాలని... బీజేపీని నిలదీసేందుకు ఏపీని కూడా కలుపుకుని పోవాలని చెప్పారు.
రాష్ట్ర విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందనే విషయం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు ఉభయసభల్లో చెప్పారని ఉండవల్లి అన్నారు. 2013లోనే రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఆ తర్వాత ప్రముఖ న్యాయవాది అల్లంకి రమేశ్ ద్వారా అర్జెంట్ పిటిషన్ దాఖలు చేయించానని తెలిపారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించారు.
లోక్ సభలో వైసీపీ ఎంపీలతో చర్చ పెట్టించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై ఏపీ నేతలు స్పందించాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాగే కొట్టుకుంటూ ఏపీకి అన్యాయం చేస్తారా? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆలోచించరా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై జగన్ నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు.