Maharashtra: మహారాష్ట్రలో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ.. 25 వేల కోళ్లను చంపేయాలని ఆదేశాలు!
- థానే జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
- హఠాత్తుగా చనిపోయిన వందకు పైగా కోళ్లు
- కోళ్ల నమూనాలను పరీక్షించగా హెచ్5ఎన్1గా నిర్ధారణ
కరోనా దెబ్బకు మహారాష్ట్ర విలవిల్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్రాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. థానే జిల్లాలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో దాదాపు వంద కోళ్లు హఠాత్తుగా మృతి చెందాయి. దీంతో చనిపోయిన కోళ్ల నమూనాలను పూణేలోని ల్యాబ్ కు పంపించారు. పరీక్షల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా కారణంగానే కోళ్లు చనిపోయాయని తేలింది.
దీంతో ఈ వైరస్ ను కట్టడి చేయడానికి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వైరస్ గుర్తించిన కోళ్ల ఫామ్ ఉన్న ప్రాంతం నుంచి దాదాపు కిలోమీటర్ పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. అంతేకాదు, థానేకు ఆనుకుని ఉన్న జిల్లాలను కూడా అప్రమత్తం చేశారు. ప్రతి ఏడాది ఏదో ఒక చోట బర్డ్ ఫ్లూ జనాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.