Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్.. పార్టీకి జగ్గారెడ్డి రాంరాం!

Sangareddy Congress MLA T Jagga Reddy qutting party today
  • నేడు అధిష్ఠానానికి రాజీనామా లేఖ
  • రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీకి దూరంగా జగ్గారెడ్డి
  • పార్టీ వీడేందుకు గల కారణాలను వివరిస్తూ సోనియాకు లేఖ!
  • పార్టీలోని కొందరు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని ఆవేదన
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ ఇది. గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) నేడు పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని కూడా సమాచారం. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని చెప్పారు.

పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనను అవమానించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలోని కొందరు కుట్రలు చేశారని, ఇవన్నీ తట్టుకోవడం ఇక తన వల్ల కాకపోవడం వల్లే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు ఓ పత్రికతో మాట్లాడుతూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రాజీనామా లేఖను నేడు అధిష్ఠానానికి సమర్పిస్తానని చెప్పారు. పార్టీని వీడడానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని కూడా జగ్గారెడ్డి భావిస్తున్నారు.

2018 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కరే. పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి ఇవ్వడాన్ని తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న ఆయన పలుమార్లు బాహాటంగానే తన వ్యతిరేకతను బయటపెట్టారు. నిన్నమొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్‌పై విరుచుకుపడిన జగ్గారెడ్డి ఇటీవల దూకుడు తగ్గించడం కూడా ఆయన తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నాయి. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని జగ్గారెడ్డి చెప్పడం గమనార్హం.
Congress
Telangana
TRS
T.Jagga Reddy

More Telugu News