Nagpur: కారు నడుపుతూ కునుకు తీస్తే తట్టి లేపే పరికరం.. నాగ్ పూర్ యువకుడి ఆవిష్కరణ
- చెవికి ధరిస్తే చాలు
- 30 డిగ్రీలకు మించి తల వంచితే అలారమ్
- ప్రమాదాల నివారణ మార్గం
- స్వీయ అనుభవమే ఆవిష్కరణకు బీజం
కారు నడుపుతూ కనురెప్ప ఆర్పి వేయడం కారణంగా ప్రమాదాలు జరిగి కొన్ని వందల ప్రాణాలు ఏటా గాల్లో కలిసిపోతున్నాయి. కొందరు తృటిలో ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు. దీనికి పరిష్కారాన్ని కనుగొన్నాడు నాగ్ పూర్ కు చెందిన యవకుడు గౌరవ్ సావల్కే.
నిద్రలేమి, అలసట, అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనాలను నడపడం ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతుంటాయి. సరిగ్గా గౌరవ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం ఇతడు నేపాల్ వెళ్లాడు. రాత్రి సమయంలో కారు నడుపుతున్నప్పుడు నిద్ర వచ్చి తలవాల్చాడు. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనే అతడిలో ఆవిష్కర్తను బయటకు తీసుకొచ్చింది.
వాహనం నడుపుతున్నప్పుడు నిద్ర కారణంగా ప్రమాదాలు జరగకూడదని గౌరవ్ భావించాడు. అలాంటి సందర్భాల్లో వాహనదారుడిని అప్రమత్తం చేసే పరికరం ఉంటే భద్రత పెరుగుతుంది కదా? అనుకున్నాడు. తనకున్న నైపుణ్యంతో చెవికి ధరించే ఒక పరికరాన్ని రూపొందించాడు. మనం కూర్చుని నిద్రపోతే కనుక తలను కిందకు వాల్చేస్తాం. గౌరవ్ పరికరం ఇదే కిటుకు ఆధారంగా పనిచేస్తుంది. తలను 30 డిగ్రీలకు మించి వంచితే చెవికి ధరించిన పరికరంలోని సెన్సార్ గుర్తిస్తుంది. వెంటనే అలారం రూపంలో వాహనదారుడిని మేల్కొలుపుతుంది.