Russia: ఉక్రెయిన్ సంక్షోభంపై భారత విధానానికి రష్యా జోహార్లు
- భారత్ తటస్థ, స్వతంత్ర విధానానికి స్వాగతం
- భారత్ లో రష్యా రాయబార కార్యాలయం ట్వీట్
- ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉండాలి
- రష్యా, ఉక్రెయిన్ కు భారత్ సూచన
ఉక్రెయిన్ విషయంలో పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న రష్యా.. ఇదే అంశంలో భారత్ తటస్థ విధానాన్ని ఆహ్వానించింది. ఉక్రెయిన్ సమస్యకు సంబంధించి మిన్స్క్ ఒప్పందాలు అమలు చేసే విషయంలో రష్యా తీసుకుంటున్న చర్యలను భారత్ ఆహ్వానించింది.
ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కు సంబంధించి ఈ ఒప్పందాల ఆధారంగా చర్చలు జరిపి, శాంతియుత ఒప్పందానికి రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రభుత్వం, రష్యా మాట్లాడే వేర్పాటు వాదుల మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతూ 2014, 2015లో మిన్స్క్ ఒప్పందాలు చేసుకున్నా అవి ఇంత వరకు అమలు కాలేదు.
‘‘తక్షణమే ఉద్రిక్తలు తగ్గించేందుకు కనుగొనే పరిష్కారంపై భారత ప్రయోజనాలు ఆధారపడినట్టు తిరుమూర్తి పేర్కొన్నారు. ఈ సమయంలో నిర్మాణాత్మక చర్యలు కావాలి. అంతర్జాతీయ శాంతి, భద్రత విశాల ప్రయోజనాల దృష్ట్యా ఉద్రిక్తతలు పెంచే చర్యలకు ఇరు వర్గాలు దూరంగా ఉండాలి’’ అని తిరుమూర్తి సూచించారు.
దీనిపై భారత్ లోని రష్యా రాయబార కార్యాలయం స్పందించింది. తిరుమూర్తి ప్రసంగానికి సంబంధించిన వీడియో ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ‘‘భారత్ తటస్థ, సిద్ధాంత, స్వతంత్ర విధానాన్ని స్వాగతిస్తున్నాం’’అని పేర్కొంది.