Salads: సలాడ్స్ తో చక్కగా బరువు తగ్గొచ్చు!
- వీటిలో తక్కువ కేలరీలు
- ఎక్కువ పోషకాలు
- పీచు పదార్థం కూడా ఎక్కువే
- తాజా పండ్లు, కూరగాయలతో సలాడ్స్
- ఆహారంలో భాగంగా తీసుకోవాలి
శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరం. లేదంటే పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. కొందరు తమ ప్రమేయం లేకుండానే బరువు పెరిగిపోతున్నామని బాధను వ్యక్తం చేస్తుంటారు. బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు శారీరక వ్యాయామాలు ఎంతో సహకరిస్తాయి. అంతేకాదు, ఆహారంలో భాగంగా సలాడ్స్ తీసుకుంటే బరువు తగ్గొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎన్నో పరిశోధనలు కూడా సలాడ్స్ బరువు తగ్గిస్తాయని నిర్ధారించాయి.
ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. సలాడ్స్ ఇందుకు ఒక మార్గం. బరువును తగ్గించే ఆహార మెనూలో ఇవి కూడా ఉండాల్సిందే. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో భాగంగా సలాడ్స్ తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
బరువును తగ్గించడమే కాకుండా సలాడ్స్ తో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టమాటా, ఉల్లిగడ్డలు, క్యాబేజీ, బ్రొకోలీ, పండ్లు.. ఇవన్నీ కూడా తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ తో ఉంటాయి. బరువు తగ్గడంలో ఫైబర్ (పీచు పదార్థం) కూడా కీలకమే అవుతుంది.
క్యాబేజీని తరిగి, పుదీనా ఆకులు, నిమ్మరసం, టమాటా, ఉప్పుతో సలాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ తీసుకుంటే విటమిన్లు, పోషకాలు పుష్కలంగా అందుతాయి. ద్రాక్ష, కమలాలో విటమిన్ సీ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే, కివీ, యాపిల్, దానిమ్మ, అనాస, స్ట్రాబెర్రీ, అరటి పండు, బొప్పాయి పండుతో సలాడ్స్ చేసుకుని తీసుకోవచ్చు.
సలాడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. తాజా పండ్లు, కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికారకాలను బయటకు పంపిస్తాయి. పీచు పదార్థం కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తుంది.