Charanjit Singh Channi: గడువు ముగిసిన తర్వాత ఇంటింటి ప్రచారం... పంజాబ్ సీఎంపై కేసు
- పంజాబ్ లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు
- నిన్ననే ముగిసిన ప్రచార పర్వం
- సీఎం చన్నీ, కాంగ్రెస్ అభ్యర్థి శుభ్ దీప్ పై ఆప్ నేతల ఫిర్యాదు
పంజాబ్ లో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నిన్న (శుక్రవారం) సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే, ప్రచార సమయం ముగిసినా గానీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వాహించారంటూ కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కేసు నమోదు చేశారు.
సీఎం చన్నీ, శుభ్ దీప్ సింగ్ మాన్సా నియోజకవర్గంలో సమయం ముగిసినా ఇంటింటి ప్రచారం నిర్వాహించారని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంటనే మాన్సా నియోజకవర్గంలో తనిఖీ చేశారు. అయితే సీఎం చన్నీ అప్పటికే ప్రచారం ముగించుకుని ప్రార్థనల నిమిత్తం గురుద్వారాకు వెళ్లినట్టు స్థానికులు ఆ అధికారికి తెలిపారు. దాంతో, నిఘా కెమెరాల ఫుటేజిని పరిశీలించి, సీఎం చన్నీ నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.