Cheteshwar Pujara: శ్రీలంకతో టెస్టు సిరీస్ కు పుజారా, రహానేపై వేటు... టీమిండియా టెస్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ
- ఇటీవల పేలవంగా ఆడుతున్న రహానే, పుజారా
- రంజీ ట్రోఫీలో సెంచరీ చేసిన రహానే
- అయినా పట్టించుకోని సెలెక్టర్లు
- అన్ని ఫార్మాట్లలో రోహిత్ కే పగ్గాలు
ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలపై వేటు పడింది. శ్రీలంకతో టెస్టు, టీ20 సిరీస్ లకు సెలక్టర్ల బృందం టీమిండియాను ఎంపిక చేసింది. పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన పుజారా, రహానేలను శ్రీలంకతో టెస్టు సిరీస్ కు ఎంపిక చేయలేదు.
తాజాగా రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో రహానే సెంచరీ చేసినా సరే సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఇక వీరిద్దరూ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం కష్టమే. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మాన్ గిల్ వంటి ప్రతిభావంతులు సత్తా చాటేందుకు ఉరకలేస్తున్నారు. కాగా, శ్రీలంకతో టెస్టు సిరీస్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించారు. దాంతో, అన్ని ఫార్మాట్లలో రోహిత్ కే టీమిండియా పగ్గాలు లభించినట్టయింది.
శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. తొలుత ఈ నెల 24 నుంచి టీ20 సిరీస్ జరగనుంది. అనంతరం, మార్చి 4 నుంచి టెస్టు సిరీస్ షురూ అవుతుంది.
శ్రీలంకతో టెస్టు సిరీస్ కు టీమిండియా ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైఎస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, ప్రియాంక్ పాంచల్, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ (ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే), రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్.
శ్రీలంకతో టీ20 సిరీస్ కు టీమిండియా ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్.