Revanth Reddy: జగ్గారెడ్డి అంశం టీ కప్పులో తుపాను వంటిది: రేవంత్ రెడ్డి

Revanth Reddy opines on Jagga Reddy issue
  • పార్టీకి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటన
  • సోనియా, రాహుల్ లకు లేఖ
  • పార్టీలో ఉండలేనని వెల్లడి
  • కోవర్టుగా ముద్రవేస్తున్నారని ఆవేదన
  • త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయన్న రేవంత్
ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాతావరణం లేదని, తనపై టీఆర్ఎస్ కోవర్టు అనే ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. పార్టీని వీడుతున్నట్టు జగ్గారెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.

జగ్గారెడ్డి అంశం టీ కప్పులో తుపాను వంటిదేనని, త్వరగానే సమసిపోతుందని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే, పార్టీలోనూ భేదాభిప్రాయాలు ఉండడం సహజమని అన్నారు. మరికొన్నిరోజుల్లో అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని తెలిపారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాశారు. త్వరలో పార్టీ పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వారికి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చి లాబీయింగ్ చేసి పీసీసీ చీఫ్ కావొచ్చని జగ్గారెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

సొంతపార్టీలోనే తనను కోవర్టు అని ముద్రవేస్తున్నారని, కొందరు యూట్యూబ్ చానళ్ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే నేను చేసిన నేరమా? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ఉన్నా హుందాగా ఉండేదని, ఇప్పుడది లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy
Jagga Reddy
Congress
Resignation
Telangana

More Telugu News