Colleges: కెనడాలో దివాళా తీసిన మూడు కాలేజీలు... దిక్కుతోచని స్థితిలో భారతీయ విద్యార్థులు
- మూతపడిన మూడు కాలేజీలు
- అగమ్యగోచరంగా 2 వేల మంది విద్యార్థుల పరిస్థితి
- భారత హైకమిషన్ కు పోటెత్తిన విద్యార్థులు
- కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న హైకమిషన్
అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులు అత్యధికంగా వెళ్లే దేశాల్లో కెనడా కూడా ఒకటి. అయితే కెనడాలోని మూడు కాలేజీలు దివాళా తీశాయి. మాంట్రియల్ లోని ఎం కాలేజి, షేర్ బ్రూక్ లోని సీడీఈ కాలేజి, లాంగ్వెల్ లోని సీసీఎస్ క్యూ కాలేజి బోర్డు తిప్పేశాయి. తాజాగా ఈ మూడు కాలేజీలు మూతపడడంతో, వాటిలో చదువుతున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ మూడు కాలేజీలు మూతపడడానికి కొన్నిరోజుల ముందు విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి.
కాగా, ఈ మూడు కాలేజీలను నిర్వహిస్తున్నది ఒకటే సంస్థ. రైజింగ్ ఫినిక్స్ ఇంటర్నేషనల్ అనే రిక్రూటింగ్ సంస్థ ఆధ్వర్యంలోని ఈ కాలేజీలు ఇటీవల చేతులెత్తేశాయి. దీనిపై క్విబెక్ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. కాగా, ఆ మూడు కాలేజీల నిర్వాకంతో దిక్కుతోచని స్థితిలో పడిన భారతీయ విద్యార్థులు చివరి ప్రయత్నంగా ఒట్టావాలోని భారత హైకమిషన్ కు పోటెత్తారు.
ఫీజు రీయింబర్స్ మెంట్, ఫీజు బదిలీ అంశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు క్విబెక్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని భారత హైకమిషన్ ఓ ప్రకటన చేసింది. ఆ మూడు కళాశాలలు వసూలు చేసిన ఫీజులను తిరిగి రాబట్టేందుకు ఉన్న అవకాశాలను తాము పరిశీలిస్తున్నామని, అన్ని రకాల చర్యలు తీసుకుంటామని భారత హైకమిషన్ హామీ ఇచ్చింది. క్విబెక్ ప్రభుత్వ వర్గాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. కాగా, మూతపడిన ఈ మూడు కాలేజీల్లో దాదాపు 2 వేల మంది వరకు భారతీయ విద్యార్థులు చదువుతున్నట్టు తెలుస్తోంది.