Uttar Pradesh: పంజాబ్, యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. బరిలో ఉన్న ప్రముఖులు వీరే!
- యూపీలో మూడో విడత ఎన్నికలు
- పంజాబ్లోని 117 స్థానాలకు ఒకే విడత
- తొలిసారి ఎన్నికల బరిలోకి అఖిలేశ్ యాదవ్
- సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్
ఐదు రాష్ట్రాలకు వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నేడు యూపీ, పంజాబ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లోని 16 జిల్లాల్లో 59 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, పంజాబ్లోని 117 స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
యూపీలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుండగా, పంజాబ్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తొలిసారి ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆయన పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలోనూ నేడే పోలింగ్ జరుగుతోంది.
యూపీలో ఈ విడతలో బరిలో ఉన్న ప్రముఖుల్లో అఖిలేశ్ చిన్నాన్న శివ్పాల్ యాదవ్, బీజేపీ నేత సతీశ్ మహానా, రామ్వీర్ ఉపాధ్యాయ్, అసీం అరుణ్, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ కుర్షీద్ భార్య లూయిస్ కుర్షీద్ తదితరులు ఉన్నారు. ఈ విడతతో యూపీలో దాదాపు సగం సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది.
పంజాబ్ విషయానికి వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, అకాలీదళ్కు చెందిన విక్రమ్ సింగ్, అమరీందర్ సింగ్, అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.