Rahul Dravid: ద్రవిడ్ నన్ను రిటైర్ అయిపోమన్నారు.. వృద్ధిమాన్ సాహా సంచలన వ్యాఖ్యలు
- శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
- సాహాకు దక్కని చోటు
- తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వికెట్ కీపర్
టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో వచ్చే నెలలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం నిన్న భారత జట్టును ప్రకటించగా వృద్ధిమాన్ సాహాకు చోటు లభించలేదు. అలాగే, గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతూ విమర్శలు మూటగట్టుకున్న అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మను కూడా పక్కనపెట్టారు.
టెస్టు జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై స్పందించిన సాహా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులోకి తనను తీసుకోబోమని జట్టు యాజమాన్యం తనతో ముందే చెప్పిందని పేర్కొన్నాడు. ద్రవిడ్ అయితే రిటైర్మెంట్ గురించి ఆలోచించమన్నాడని పేర్కొన్నాడు. గతేడాది న్యూజిలాండ్‌తో కాన్పూరులో జరిగిన టెస్టులో గాయంతో ఇబ్బంది పడుతూనే అజేయంగా 61 పరుగులు చేశానని సాహా గుర్తు చేశాడు.
అప్పట్లో గంగూలీ తనకు శుభాకాంక్షలు కూడా తెలిపారనీ, తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు దేని గురించీ ఆలోచించాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారని అన్నాడు. కానీ పరిస్థితులు ఇంత త్వరగా తారుమారు అవుతాయని ఊహించలేదని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు.