KCR: బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్.. కవిత సహా పలువురు నేతలతో ముంబైకి సీఎం
- కాసేపట్లో మహారాష్ట్ర సీఎంతో చర్చలు ప్రారంభం
- ఉద్ధవ్ పిలుపు మేరకు ముంబైకి కేసీఆర్
- కేంద్ర ప్రభుత్వంపై పోరాటం విషయంలో చర్చలు
కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇటీవల ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ముంబై రావాలని, రాజకీయ అంశాలపై చర్చిద్దామని కేసీఆర్ కు ఉద్ధవ్ చెప్పారు. దీంతో ఈ రోజు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ ముంబై బయలుదేరారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం కొనసాగించడం, దేశంలో బీజేపీని ఎదుర్కొనేలా కూటమిని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
ఎన్డీయే, యూపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇరువురి మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వర్షలో ఈ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.