Jagga Reddy: ఆ అవకాశం రాకపోతే రాజీనామా చేస్తా: జగ్గారెడ్డి ప్రకటన
- కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు నాతో మాట్లాడారు
- 15 రోజులు ఎలాంటి కామెంట్లు చేయబోనని మాట ఇచ్చాను
- సోనియా, రాహుల్ తో అపాయింట్మెంట్ ఇప్పిస్తే మాట్లాడతా
- 15 రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తాను
- అధిష్ఠానంతో మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందనే నేను ఆశిస్తున్నాను
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు తనతో మాట్లాడారని చెప్పారు. 15 రోజులు తాను ఎలాంటి కామెంట్లు చేయబోనని వారికి మాట ఇచ్చానని తెలిపారు.
తనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పిస్తే వారితో అన్ని విషయాలు మాట్లాడతానని జగ్గారెడ్డి చెప్పారు. ఆ అవకాశం రాకపోతే రాజీనామా చేస్తానని చెప్పారు. 15 రోజుల తర్వాతే మళ్లీ తాను మీడియా ముందుకు వస్తానని తెలిపారు. తనకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాతే తాను ఢిల్లీకి వెళ్తానని అన్నారు.
అధిష్ఠానంతో మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందనే తాను ఆశిస్తున్నానని చెప్పారు. తన ఆవేదన చెప్పుకునే అవకాశం రావాలని ఆయన అన్నారు. తనపై కొందరు కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వేదికగా పలు కామెంట్లు చేశారని తెలిసిందని చెప్పారు. టీ కప్పులో తుపాను అని కొందరు అంటున్నారని ఆయన అన్నారు.
తన వ్యాఖ్యలను కొట్టిపారేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తనను బుజ్జగించాలనుకున్న వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క వంటి వారికి తాను ఓ మాట చెప్పానని అన్నారు. తనకు సోనియా, రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరానని తెలిపారు. వారు అపాయింట్మెంట్ ఇప్పిస్తారో ఇప్పించరో చూద్దామని, అధిష్ఠానంతో మాట్లాడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని వివరించారు.