CM KCR: ముంబయిలో మహా సీఎం ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ సమావేశం
- ముంబయి చేరుకున్న సీఎం కేసీఆర్ బృందం
- తన నివాసంలో సాదర స్వాగతం పలికిన ఉద్ధవ్ థాకరే
- సీఎం బృందంలో కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్
- ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించే అవకాశం
ముంబయి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బృందానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సాదర స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి విమానాశ్రయం నుంచి నేరుగా ఉద్ధవ్ థాకరే అధికారిక నివాసానికి తరలి వెళ్లారు. థాకరే నివాసానికి వచ్చినవారిలో కేసీఆర్ వెంట ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు.
సీఎం కేసీఆర్ కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. తనలాంటి భావజాలం ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకుని పోవాలని ఆయన భావిస్తున్నారు. కాగా, సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశంలో జాతీయస్థాయిలో కొత్త ఫ్రంట్ అంశం చర్చకు రానుంది. ప్రస్తుత రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.