Chandrababu: భూమి వివాదంలో చంద్రబాబు కుటుంబానికి ఊరట

Chandrababu family gets consolation in a land dispute
  • నారావారిపల్లెలో భూ ఆక్రమణ
  • రామ్మూర్తి నాయుడుకు చెందిన భూమిలో రాళ్లు పాతిన వ్యక్తి
  • విచారణ జరిపిన తహసీల్దారు శిరీష
  • ఇరువర్గాల పత్రాల పరిశీలన
  • ఈసీ సమర్పించిన చంద్రబాబు కుటుంబ ప్రతినిధి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వగ్రామంలో ఆయన కుటుంబీకులకు చెందిన భూమి ఆక్రమణకు గురికావడం తెలిసిందే. చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూర్తికి చెందిన స్థలంలో రాజేంద్రనాయుడు అనే వ్యక్తి కంచె వేసేందుకు రాళ్లు పాతారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో, నారావారిపల్లె గ్రామ తహసీల్దారు శిరీష ఇరువర్గాల నుంచి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను తెప్పించి పరిశీలించారు.

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేంద్రనాయుడు ఆన్ లైన్ అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం చూపించారు. ఆన్ లైన్ లో తన తల్లి పేరు ఉందని, సదరు భూమిపై బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకున్నానని తహసీల్దారుకు వివరించారు.

ఇక చంద్రబాబు కుటుంబ ప్రతినిధి రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆ భూమికి సంబంధించిన ఈసీ తీసుకుని, దాన్ని తహసీల్దారుకు సమర్పించారు. ఆ ఈసీలో చంద్రబాబు తండ్రి నారా ఖర్జూరనాయుడు పేరు ఉంది. రాజేంద్రనాయుడు చెబుతున్న కృష్ణమనాయుడు, సిద్ధమ్మల పేర్లు ఆ ఈసీలో లేవు.

దాంతో ఆ భూమి చంద్రబాబు కుటుంబీకులకే చెందుతుందని తహసీల్దార్ శిరీష స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ లో పేర్లున్న వారిపైనే ఆన్ లైన్ లోకి మార్చాల్సి ఉంటుందని, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సదరు ప్రక్రియ ప్రారంభిస్తామని తహసీల్దారు చంద్రబాబు కుటుంబీకులకు తెలిపారు. అధికారుల నిర్ణయంతో చంద్రబాబు కుటుంబానికి ఊరట కలిగినట్టయింది.

ఆ భూమి నారా ఖర్జూరనాయుడు పేరు మీదే రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ, ఆన్ లైన్ లో ఆ వివరాలు నమోదు కాకపోవడంతో ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది.
Chandrababu
Family
Land Dispute
Naravaripalle

More Telugu News