Suryakumar Yadav: చివరి టీ20లోనూ భారత్‌దే విజయం.. విండీస్ మళ్లీ వైట్‌వాష్!
- వరుసగా ఆరు మ్యాచుల్లోనూ భారత్ చేతిలో ఓడిన విండీస్
- పరాభవ భారంతో తిరుగుముఖం
- చివరి టీ20లో 17 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా సూర్యకుమార్ యాదవ్
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు ఘోర పరాభవ భారంతో స్వదేశానికి బయలుదేరుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో దారుణంగా ఓడిన విండీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ తేరుకోలేకపోయింది. ఇందులోనూ వైట్‌వాష్ అయింది. ఫలితంగా వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గత రాత్రి జరిగిన చివరి టీ20లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను ఎగరేసుకుపోయింది.
సూర్యకుమార్ (65) అద్భుత ఆటతీరుకు తోడు వెంకటేశ్ అయ్యర్ మెరుపులతో భారత జట్టు తొలుత 184 పరుగులు చేసింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. పర్యాటక జట్టులో నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్ తప్ప మరెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. పూరన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 61 పరుగులు చేయగా, రొమారియో 21 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. రోవ్‌మన్ పావెల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోవడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ చిచ్చర పిడుగల్లే చెలరేగిపోయాడు. 31 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 65 పరుగులు చేసి టీ20ల్లో తన నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (7) తీవ్రంగా నిరాశ పరిచారు.
విండీస్ బౌలర్లలో హోల్డర్, రొమారియో, రోస్టన్ చేజ్, హేడెన్ వాల్ష్, డొమినిక్ డ్రేక్స్‌కు తలా ఓ వికెట్ దక్కింది. బ్యాటింగ్‌లో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.