passive income: క్రిప్టో కరెన్సీ ఉంటే చాలు.. ఏం చేయకపోయినా ఆదాయం
- జెబ్ పేలో క్రిప్టో డిపాజిట్ సేవలు
- వీటిపై 10 శాతం వరకు వార్షిక రాబడి
- కావాలనుకున్నప్పుడు విక్రయించుకోవచ్చు
క్రిప్టో కరెన్సీలు యువ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా మారిపోయాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది వీటిల్లో పెట్టుబడులను పరిశీలిస్తున్నారు. స్వల్పకాలంలోనే ఎన్నో రెట్లు ర్యాలీ చేస్తుండడం వీటిపై ఆకర్షణకు కారణం. అంతేకాదు, బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేసే క్రిప్టోల విషయంలో టెక్నాలజీ కోణాన్ని చూసేవారు కూడా ఉన్నారు.
క్రిప్టో కరెన్సీలను భవిష్యత్తు కోసం కొనుగోలు చేసి పెట్టుకునే వారు, వీటిపై స్థిరమైన ఆదాయం పొందే అవకాశం కూడా ఉందని తెలుసుకోవాలి. క్రిప్టో ఎక్సేంజ్ ‘జెబ్ పే’లో యూజర్లు క్రిప్టో సేవింగ్స్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ క్రిప్టోలను వీటికి బదిలీ చేయాలి. ఇందుకోసం ఫిక్స్ డ్ డిపాజిట్ ను జెబ్ పే నిర్వహిస్తోంది.
క్రిప్టోల విలువ ఆధారంగా స్టాండర్డ్ డిపాజిట్ పై 3 శాతం నుంచి 7.5 శాతం వరకు వార్షిక రాబడిని జెబ్ పే ఆఫర్ చేస్తోంది. ఒకవేళ యూఎస్ డీటీ డిపాజిట్ అయితే 9-10 శాతం వరకు వార్షిక రాబడిని అందిస్తోంది. యూజర్లకు తమ హోల్డింగ్స్ పై నియంత్రణ కొనసాగుతుంది. కావాలంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు. హోల్డింగ్స్ ను విక్రయించి, పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు.
బిట్ కాయిన్, ఎథీరియం, బినాన్స్, డీఏఐ, యూఎస్ డీటీ, మ్యాటిక్ హోల్డింగ్స్ ను డిపాజిట్ చేసి ఆదాయం పొందొచ్చు. ఇందులో మ్యాటిక్ పై అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ హోల్డింగ్స్ ను ట్రేడింగ్ చేసుకునే వారికి జెబ్ పే లెండింగ్ పై ఆఫర్ చేస్తుంది. అలా వచ్చే రాబడిని ఇన్వెస్టర్లకు పంచుతుంది. ఇతర క్రిప్టో ఎక్సేంజ్ లు సైతం ఈ తరహా సేవలను అందిస్తున్నాయి.