ipo: లాభాల కాంక్షతో ఐపీవోలో పాల్గొంటే.. రిస్క్ ఎదుర్కోవాల్సిందే
- కంపెనీ గురించి అధ్యయనం చేయాలి
- దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకోవడం సురక్షితం
- స్వల్పకాలంలో ఏం జరుగుతోందో చెప్పడం కష్టం
- నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు
ఎల్ఐసీ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను మార్చిలో ప్రారంభించనుంది. పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఐపీవోలో పాల్గొంటారన్న అంచనాలున్నాయి. కొత్త ఇన్వెస్టర్లు కూడా అడుగుపెట్టొచ్చని భావిస్తున్నారు. ఐపీవోలకు వచ్చే ఆయా కంపెనీల సానుకూలతలు, ప్రతికూలతల గురించి అధ్యయనం చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నష్టాల రిస్క్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో ఐపీవోలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందనను చూశాయి. లిస్టింగ్ లోనే కొన్ని రెట్టింపునకు పైగా లాభాలను ఇచ్చాయి. కానీ, అదే సమయంలో షేరు జారీ ధర కంటే తక్కువలో లిస్ట్ అయినవీ ఉన్నాయి. లిస్టింగ్ ధరతో పోలిస్తే భారీగా నష్టపోయి ట్రేడ్ అవుతున్నవి కూడా కనిపిస్తాయి.
2021 ఏప్రిల్ 1 నుంచి సుమారు 50 కంపెనీలు ప్రజల నుంచి రూ.1.11 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిల్లో 18 కంపెనీల షేర్లు జారీ ధర కంటే దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. మిగిలిన 32 కంపెనీల్లో 12 కంపెనీలు 15 శాతం వరకు పెట్టుబడిని వృద్ధి చేశాయి. పేటీఎం షేరు జారీ ధర రూ.2,150 కాగా అదిప్పుడు రూ.823 సమీపంలో ట్రేడ్ అవుతోంది. పీబీ ఫిన్ టెక్, కార్ ట్రేడ్ టెక్ షేర్లు కూడా ఐపీవో ధర కంటే దిగువనే ఉన్నాయి.
‘ఐపీవోకు దరఖాస్తు చేసుకుందాం. అలాట్ అయితే లిస్టింగ్ అయిన వెంటనే లాభాలకు అమ్ముకుందాం’ ఈ ధోరణితో ఉంటే దాన్ని మార్చుకోవాలి. మంచి కంపెనీ, దీర్ఘకాలంలో చక్కని వృద్ధికి అవకాశం ఉందని భావిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి. స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే భారీగా నష్టాలకూ సిద్ధ పడాల్సిందే.