Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి పోస్ట్ కొవిడ్ దుష్ప్రభావాలే కారణమా...?

Reasons likely behind Mekapati sudden demise

  • గతంలో రెండు పర్యాయాలు కరోనా బారినపడిన మంత్రి
  • దుబాయ్ పర్యటనలో బిజీగా గడిపిన వైనం
  • నిన్న నెల్లూరులో ఓ నిశ్చితార్థానికి హాజరు
  • విశ్రాంతి లేకుండా పర్యటనలు!

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. శారీరకంగా ఎంతో దృఢంగా కనిపించే గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావడమేంటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడున్నా ఫిట్ నెస్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మేకపాటి హార్ట్ అటాక్ తో మరణించారన్న వార్తను నమ్మలేకపోతున్నారు.

అయితే, ఆయన మరణానికి కొవిడ్ అనంతరం దుష్ప్రభావాలే కారణం అయ్యుంటాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. కొవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో గుండెపోటు అనేది సాధారణమైపోయిందని ఆయన పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి గతంలో రెండు పర్యాయాలు కొవిడ్ బారినపడడం తెలిసిందే. ఇటీవల రెండోసారి కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు.

గత కొన్నిరోజులుగా దుబాయ్ లో ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు బిజీబిజీగా గడిపారు. నిన్ననే హైదరాబాద్ తిరిగొచ్చిన ఆయన నెల్లూరులో బంధువుల ఇంట ఓ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఆపై హైదరాబాద్ వచ్చి ఈ ఉదయం హఠాన్మరణానికి గురయ్యారు.

రాజకీయ వర్గాల్లో ఎంతో సున్నిత మనస్కుడిగా, స్నేహశీలిగా గౌతమ్ రెడ్డికి పేరుంది. రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఎక్కడా రాజకీయాల జోలికి పోకుండా, కేవలం తన మంత్రిత్వ శాఖ గురించే మాట్లాడుతుంటారు. అందుకు ఆయన ప్రెస్ మీట్లే నిదర్శనం. విపక్షనేతలు ఇతర వైసీపీ మంత్రులను తీవ్రస్థాయిలో విమర్శించిన సందర్భాలు ఉన్నాయి గానీ, మేకపాటిపై చిన్న వ్యాఖ్య కూడా చేయరు. అందుకు కారణం ఆయన వ్యక్తిత్వమే.

ఎక్కడా, ఎవరినీ నొప్పించని వ్యక్తిగా వ్యాపార, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే ఈలోకాన్ని వీడడం అత్యంత బాధాకరమని సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

  • Loading...

More Telugu News