Revanth Reddy: మోదీని మళ్లీ గెలిపించడానికి కేసీఆర్ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు: రేవంత్ రెడ్డి
- ముంబయిలో ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ భేటీ
- బీజేపీ వ్యతిరేక పార్టీలను కూడగట్టే ప్రయత్నం
- యూపీఏను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాడన్న రేవంత్
- కాంగ్రెస్ ను బలహీనపర్చే చర్యలు అని విమర్శలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు రెండుసార్లు గెలిచారని, ఆయనను మూడోసారి కూడా గెలిపించడానికి సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని ఆరోపించారు. యూపీఏను చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎవరిని బలహీన పర్చేందుకు ప్రయత్నిస్తున్నారు? మోదీనా, యూపీఏనా? అని ప్రశ్నించారు.
మోదీని ఓడించడమే కేసీఆర్ లక్ష్యం అయితే, ఉత్తరప్రదేశ్ లో సభలు పెట్టాలని సవాల్ విసిరారు. యూపీలో ఇప్పటివరకు 3 విడతల ఎన్నికలు జరిగాయని, ఇంకా 4 విడతలు మిగిలున్నాయని, విడతకొక బహిరంగ సభ చొప్పున కేసీఆర్ యూపీలో సభలు జరపాలని రేవంత్ రెడ్డి సూచించారు.
సీఎం కేసీఆర్ నిన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో ముంబయిలో సమావేశం కావడం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఈ భేటీపైనే పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది.