YS Vivekananda Reddy: వివేకా కేసులో సీబీఐ దూకుడు.. పులివెందుల కోర్టుకు దస్తగిరి
- 2019 ఎన్నికలకు ముంగిట వివేకా దారుణ హత్య
- వివేకా కూతురు అభ్యర్థనతో దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి
- ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ
- తాజాగా వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని కోర్టులో హాజరు పరచిన వైనం
- దస్తగిరి వద్ద రెండోసారి వాంగ్మూలం నమోదు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరింత వేగం పెంచింది. 2019 ఎన్నికల ముంగిట కడప జిల్లా పులివెందులలోని తన సొంతింటిలోనే వివేకా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని ఆరోపించిన జగన్.. సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించగా.. టీడీపీ ఓటమిపాలైంది. ఆ తర్వాత వివేకా హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయించేందుకు జగన్ నిర్ణయించారు. ఈ దిశగా కొంతమేర దర్యాప్తు కూడా జరిగింది. అయితే రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదంటూ.. తన తండ్రి హంతకులను కనిపెట్టాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ వివేకా కూతురు డాక్టర్ సునీత నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనకు సరేనన్న హైకోర్టు కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది.
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే చాలా మందిని విచారించింది. నెలల తరబడి కడపలోనే మకాం వేసిన సీబీఐ బృందం అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసింది. అంతేకాకుండా ఇప్పటికే వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్‌లు సహా మరికొందరిని అరెస్ట్ చేసింది. ఇప్పటికే రెండు నివేదికలను కోర్టుకు సమర్పించిన సీబీఐ సోమవారం నాడు మరో కీలక అడుగు వేసింది. వివేకా వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అతడిని పులివెందుల కోర్టులో హాజరుపరిచింది. ఇప్పటికే దస్తగిరి నుంచి ఓ దఫా వాంగ్మూలాన్ని నమోదు చేసిన సీబీఐ తాజాగా మరోమారు అతడి నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఈ పరిణామంతో వివేకా కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచిందని, త్వరలోనే ఈ కేసు చిక్కుముడిని సీబీఐ విప్పనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.