Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానికి ముందు ఏం జరిగిందో చెప్పిన కుటుంబసభ్యులు!

Family members told what happened before Mekapati sudden death

  • తన నివాసంలో గుండెపోటుకు గురైన మేకపాటి
  • హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు
  • అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స
  • ఫలించని డాక్టర్ల ప్రయత్నాలు

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారన్న వార్తను కుటుంబసభ్యులు, మంత్రివర్గ సహచరులు, వైసీపీ నేతలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా, మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానికి ముందు ఏంజరిగిందో ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి రాత్రి 9.45 గంటలకు తిరిగొచ్చారని తెలిపారు. ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు లేచారని, 6.30 గంటల వరకు ఇతరులతో మాట్లాడారని చెప్పారు. ఉదయం 7 గంటలకు ఇంట్లోని సోఫాలో కూర్చున్నారని, 7.12 గంటలకు డ్రైవర్ ను పిలవమని వంటమనిషికి చెప్పారని వివరించారు. 7.15 గంటలకు గుండెపోటుతో సోఫా నుంచి కిందికి ఒరిగారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

వెంటనే స్పందించిన డ్రైవర్ నాగేశ్వరరావు మంత్రి ఛాతీపై చేయి వేసి రుద్దుతూ ఉపశమనం కలిగించారని, పరిస్థితిని గమనించిన గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి అప్రమత్తం అయ్యారని వివరించారు. అనంతరం గుండెనొప్పి వస్తోందని గౌతమ్ రెడ్డి చెప్పారని, దాంతో ఆసుపత్రికి వెళదామని సిబ్బంది ఆయనకు సూచించారని కుటుంబసభ్యులు తెలిపారు.

7.27 గంటలకు ఇంటినుంచి బయల్దేరి 5 నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నట్టు వెల్లడించారు. మేకపాటిని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చామని, ఉదయం 8.15 గంటల సమయంలో పల్స్ బాగానే ఉందని డాక్టర్లు చెప్పారని వివరించారు. అయితే, 9.13 గంటలకు గౌతమ్ రెడ్డి మరణించారని అపోలో డాక్టర్లు నిర్ధారించారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News