Karnataka: కన్నడనాట మరోమారు ఉద్రిక్తత.. భజరంగ్ దళ్ కార్యకర్త హత్యే నేపథ్యం
- భజరంగ్ దళ్ కార్యకర్త హత్య
- నిరసనగా మిన్నంటిన నిరసనలు
- పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించిన ప్రభుత్వం
- హిజాబ్ వివాదంతో సంబంధం లేదని హోం మంత్రి ప్రకటన
కర్ణాటకలో వరుసగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న హిజాబ్ వివాదం ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయగా.. తాజాగా భజరంగ్ దళ్ కార్యకర్త హత్య మరోమారు ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలను రాజేసింది. కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం రాత్రి భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్య గురించి తెలిసిన వెంటనే భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శివమొగ్గ సహా పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనల్లో పలు వాహనాలను ఆందోళనకారులు కాల్చి వేశారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయి దాటిపోతోందన్న భావనతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనలు మిన్నంటిన ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు.
ఇదిలా ఉంటే.. హిజాబ్ వివాదంతో హర్ష హత్యకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక హోం శాఖ మంత్రి ప్రకటించారు. హర్షపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారని, ఈ ఘటనలో హర్ష అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో కనిపించే అసత్య పోస్టులను నమ్మొద్దని, ప్రజలంతా సంయమనం పాటించాలని ఆయన కోరారు.