Rahul Dravid: సాహా వ్యాఖ్యలు బాధ కలిగించలేదు... అతడికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించాను: రాహుల్ ద్రావిడ్
- శ్రీలంకతో సిరీస్ కు సాహా ఔట్
- బహిరంగ విమర్శలు చేసిన సాహా
- తనను రిటైర్ అవ్వాలని ద్రావిడ్ సూచించినట్టు వెల్లడి
- సాహాకు మరిన్ని అవకాశాలు ఇవ్వలేమన్న ద్రావిడ్
గతంతో పోల్చితే టీమిండియాలో స్థానాలకు ఇప్పుడు విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కోస్థానానికి ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. వికెట్ కీపర్ స్థానానికి కూడా ఇదే తరహా పోటీ ఉంది. రిషబ్ పంత్ ప్రథమ ప్రాధాన్యత వికెట్ కీపర్ కాగా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, కేఎస్ భరత్ కూడా వికెట్ కీపర్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. అతడిని శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కు పక్కనబెట్టారు.
దీనిపై సాహా బాహాటంగానే తన అసంతృప్తి వెళ్లగక్కాడు. ఏకంగా కోచ్ రాహుల్ ద్రావిడ్ పైనే ఆరోపణలు చేశాడు. నువ్విక రిటైర్ అవడం మంచిదని సూచించాడని సాహా వెల్లడించాడు. దీనిపై ద్రావిడ్ స్పందించారు. సాహా వ్యాఖ్యలతో తనకెలాంటి బాధ లేదని, అయితే, జట్టులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సాహాకు నిజాయతీగా చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
సాహా అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, జట్టుకు విశేష సేవలు అందించాడని కొనియాడారు. భారత క్రికెట్ కోసం సాహా పాటుపడిన నేపథ్యంలో, తన స్థానంపై స్పష్టత పొందేందుకు అతడు అర్హుడని ద్రావిడ్ వివరించారు. తాను ఆ కోణంలోనే సాహాతో మాట్లాడానని స్పష్టం చేశారు. ఆటగాళ్లతో తాను నిరంతరం మాట్లాడుతూనే ఉంటానని, అయితే తాను చెప్పేది ప్రతిదీ వారు అంగీకరిస్తారని తానేమీ ఆశించడంలేదని అన్నారు. ప్రతి మ్యాచ్ జరిగే ముందు ఇలాంటి సంభాషణలు సహజమేనని, తుది జట్టులో లేని ఆటగాడు ఎందుకు స్థానం పొందలేకపోయాడో వివరించినప్పుడు అతడు బాధపడడంలో ఆశ్చర్యమేమీ లేదని ద్రావిడ్ పేర్కొన్నారు.
అంతేకాదు, సాహాను జట్టు నుంచి తప్పించడానికి గల కారణాన్ని కూడా ద్రావిడ్ వివరించారు. "జట్టులో రిషబ్ పంత్ నెం.1 వికెట్ కీపర్ గా ఉన్నాడు. అలాంటప్పుడు సాహాకు మరిన్ని అవకాశాలు ఇవ్వలేం. అతడి స్థానంలో మరో యువ వికెట్ కీపర్ (కేఎస్ భరత్)ను తయారుచేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, సాహాపై గౌరవంలో ఎలాంటి మార్పు లేదు" అని తెలిపారు.