srilanka: కరోనా ఎఫెక్ట్.. శ్రీలంకలో చమురు కష్టాలు
- శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు
- కరోనాతో దెబ్బతిన్న పర్యాటకం
- క్రమంగా కరిగిపోయిన విదేశీ మారక నిల్వలు
- చమురు దిగుమతి కోసం చిల్లిగవ్వ లేని వైనం
- ఒక్కొక్కటిగా మూడపడుతున్న పెట్రోల్ పంపులు
యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి ఒక్కో దేశం ఒక్కో రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటోంది. కరోనా దెబ్బకు దాదాపుగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయి. అయితే కొన్ని దేశాలు త్వరితగతిననే కోలుకుంటే.. మరికొన్ని దేశాలు మాత్రం ఆ ఆర్థిక ఇక్కట్ల నుంచి బయటపడలేకపోతున్నాయి. ఇలాంటి దేశాల జాబితాలో ఇప్పుడు శ్రీలంక కూడా చేరిపోయింది. కరోనా కొట్టిన దెబ్బకు శ్రీలంక ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం చమురు దిగుమతి చేసుకునేందుకు కూడా శ్రీలంక వద్ద డబ్బు లేదట. ఫలితంగా ఆ దేశంలోని పెట్రోల్ పంపులన్నీ ఒక్కటొక్కటిగా మూడపడిపోతున్నాయట.
శ్రీలంకకే ఈ తరహా పరిస్థితి ఎందుకన్న విషయానికి వస్తే.. శ్రీలంక ప్రధానంగా టూరిజంపై ఆధారపడిన దేశమే. ఆ దేశంలో పెద్దగా సహజ వనరులేమీ లేవు. శ్రీలంకకు భారీ ఎత్తున పర్యాటకులు వెళుతున్నందున విదేశీ మారక నిల్వలు పెద్ద మొత్తంలోనే ఉండేవి. అయితే కరోనా కొట్టిన దెబ్బకు పర్యాటక రంగం ఛిన్నాభిన్నమైపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా శ్రీలంక వచ్చే విదేశీ పర్యాటకులు ఒక్కసారిగా తగ్గిపోయారు. ఫలితంగా అప్పటికే అందుబాటులో ఉన్న విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన శ్రీలంక.. ఇప్పుడు విదేశీ మారక నిల్వల్లో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితికి చేరుకుంది. వెరసి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుకు చెల్లించడానికి శ్రీలంక చేతిలో పైసా కూడా లేదట.