Sonia Gandhi: మోదీ, యోగి సర్కార్లపై విరుచుకుపడిన సోనియాగాంధీ
- ఈ ప్రభుత్వాలు మీకు చేసిందేమీ లేదు
- దేశంలో 12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
- అయినా యువతను ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు
- పెట్రోలు నుంచి గ్యాస్ వరకు అన్ని ధరలు ఆకాశంలోనే..అంటూ విమర్శలు
మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతోపాటు యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ సర్కారుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్లమెంట్ నియోజకవర్గమైన రాయ్‌బరేలీ లో రేపు (బుధవారం) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను ఉద్దేశించి సోనియగాంధీ నిన్న వర్చువల్‌గా మాట్లాడారు.
లాక్డౌన్ సమయంలో మోదీ, యోగి ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారాలు మూసుకుని, కిలోమీటర్ల కొద్దీ నడిచి తీవ్ర ఇబ్బందులు పడిన మిమ్మల్ని ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కష్టపడి పండించిన పంటకు తగిన ప్రతిఫలాన్ని కానీ, ఎరువులు కానీ బీజేపీ ప్రభుత్వం మీకు అందించదని అన్నారు.
చదువుకుని ఉద్యోగాలు ఆశించే యువతను బీజేపీ ప్రభుత్వం ఇంట్లోనే కూర్చోబెడుతోందని దుమ్మెత్తిపోశారు. ప్రస్తుతం 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పెట్రోలు, డీజిలు, ఎల్పీజీల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాలు ప్రజల కోసం చేసింది ఏమీ లేదని, ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని అన్నారు.