Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై జిందాల్ స్టీల్ కన్ను!
- వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తో పాటు నాగర్నార్ ప్లాంట్‌నూ దక్కించుకునే యోచన
- కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నామన్న జిందాల్ ఎండీ
- విశాఖ ఉక్కుకు 7.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం
విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో దానిని కొనుగోలు చేసేందుకు జిందాల్ స్టీల్ ఆసక్తి చూపుతోంది. విశాఖ ఉక్కుతోపాటు ఎన్ఎండీసీకి చెందిన నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కొనుగోలుపైనా జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్‌పీఎల్) ఆసక్తి కనబరుస్తోంది. నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్స్ ఇప్పుడు వీటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (ఆర్ఐఎన్ఎల్-విశాఖ ఉక్కు), ఎన్ఎండీసీ నాగర్నార్‌లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అవి ఇంకా అమ్మకానికి రాలేదని జిందాల్ ఎండీ వీఆర్ శర్మ తెలిపారు. ఎన్ఎండీసీ స్టీల్ ప్లాంట్‌కు 3 టన్నులు, ఆర్ఐఎన్ఎల్‌కు 7.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉంది.
కాగా, జిందాల్ స్టీల్స్ దక్కించుకోలేకపోయిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌కు 1.1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉంది. దీనిని టాటా గ్రూప్ సంస్థ అయిన టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ రూ. 12,100 కోట్లకు కొనుగోలు చేసింది.