saha: ఆ జర్నలిస్టు తప్పు చేశాడనే విషయాన్ని బయటపెట్టాలనుకున్నాను.. అంతే!: క్రికెటర్ వృద్ధిమాన్ సాహా వ్యాఖ్యలు
- ఇంటర్వ్యూ ఇవ్వాలని ఓ జర్నలిస్టు నన్ను బెదిరించాడు
- ఆ జర్నలిస్టు పేరును నేను చెప్పను
- చెబితే ఆ జర్నలిస్టు కెరీర్ నాశనం అవుతుంది
- ఎవరికీ ఇలాంటి బెదిరింపులు రాకూడదన్న సాహా
టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయనను ఇంటర్వ్యూ కోసం ఒక జర్నలిస్టు బెదిరించడం కలకలం రేపుతోంది. దీంతో దీనిపై బీసీసీఐ ఆరా తీసే ప్రయత్నాలు జరుపుతోంది. అయితే, తనని బెదిరించిన జర్నలిస్టు పేరును చెప్పబోనని సాహా అంటున్నాడు.
ఈ విషయం గురించి ఇప్పటి వరకయితే బీసీసీఐ తనను ఎలాంటి వివరాలూ అడగలేదని చెప్పాడు. దీనిపై ఎవరైనా వివరాలు అడిగినా చెప్పబోనని, ఎందుకంటే అతని కెరీర్ను నాశనం చేయాలనే ఉద్దేశం తనకు లేదని అన్నాడు. తాను ఈ వివాదంపై ఇటీవల చేసిన ట్వీట్లోనూ అతడి పేరు వెల్లడించలేదని తెలిపాడు.
తాను ఇతరులను ఇబ్బందులకు గురి చేసే రకం కాదని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులు తనను అలా పెంచలేదని అన్నాడు. మీడియాలోనూ బెదిరింపులకు పాల్పడే ఒక వ్యక్తి ఉన్నాడనే నిజాన్ని బయటపెట్టాలనే తాను ట్వీట్ చేశానని తెలిపాడు. తనలా ఇతర క్రికెటర్లు ఇలాంటి బెదిరింపులు ఎదుర్కోకూడదనే తాను ఈ విషయంపై ట్వీట్ చేశానని అన్నాడు.
ఆ జర్నలిస్టు తప్పు చేశాడనే విషయాన్ని బయటపెట్టాలనుకున్నానని చెప్పాడు. ఇటువంటి ఘటనలకు మళ్లీ ఎవరూ పాల్పడకూడదని ట్వీట్ చేశానని అన్నాడు. అయితే, సాహాను బెదిరించిన జర్నలిస్టు ఎవరో గుర్తించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.