Sikhs For Justice: ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’ యాప్స్, సోషల్ మీడియా ఖాతాలపై వేటు
- బ్లాక్ చేయాలంటూ కేంద్ర సమాచార శాఖ ఆదేశం
- వీటిల్లోని కంటెంట్ మత సామరస్యానికి చేటు
- దేశ సార్వభౌమత్వానికి ముప్పు అంటూ ప్రకటన
నిషేధిత సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్ జే) తో సంబంధాలు కలిగిన పంజాబ్ పాలిటిక్స్ టీవీ.. యాప్స్, సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి నడుస్తున్న పంజాబ్ పాలిటిక్స్ టీవీ ఆన్ లైన్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలను ఎస్ఎఫ్ జే చేస్తున్నట్టు పేర్కొంది. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా సమాచార ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.
‘‘యాప్ లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న కంటెంట్ మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. వేర్పాటు వాద భావజాలం భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తుంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో కొత్త యాప్ లు, కొత్త సోషల్ మీడియా ఖాతాలను తెరవడాన్ని గుర్తించాం’’ అని తన ఆదేశాల్లో వివరించింది.