Prakash Raj: ఓ మంచి పనిని చెడగొట్టేందుకు ప్రచారం జరుగుతోంది: ప్రకాశ్ రాజ్
- ఇటీవల మహారాష్ట్ర సీఎంను కలిసిన కేసీఆర్
- కేసీఆర్ వెంట వెళ్లిన ప్రకాశ్ రాజ్
- తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపుతారంటూ ప్రచారం
- రాజ్యసభ విషయం తనకు తెలియదన్న ప్రకాశ్ రాజ్
బీజేపీ, మోదీపై యుద్ధభేరి మోగించిన తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఆయన ఇటీవలే ముంబయి వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో చర్చలు జరిపారు. కాగా, థాకరే నివాసానికి సీఎం కేసీఆర్ వెంట ప్రకాశ్ రాజ్ కూడా వెళ్లడం చర్చనీయాంశం అయింది. అంతేకాదు, ప్రకాశ్ రాజ్ ను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం కూడా మొదలైంది.
దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. తెలంగాణ నుంచి తనను రాజ్యసభకు పంపుతారనేది తెలియదని స్పష్టం చేశారు. ఓ మంచి పనిని చెడగొట్టేందుకు ప్రచారం జరుగుతోందని, మాట్లాడ్డానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు.
మరోపక్క, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్... అందుకు తగిన విధంగా తన బృందాన్ని రూపొందించుకుంటున్నారు. కేసీఆర్ టీమ్ లో ప్రకాశ్ రాజ్ కు కూడా స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. అనేక భాషలపై పట్టు, జాతీయ రాజకీయాలపై లోతైన అవగాహన, ప్రధానంగా బీజేపీపై వ్యతిరేకత... ఇవన్నీ ప్రకాశ్ రాజ్ ను కేసీఆర్ కు దగ్గర చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.