Diamond: 20 ఏళ్ల శ్రమకు.. రూ.1.2 కోట్ల వజ్రం రూపంలో కలిసొచ్చిన అదృష్టం
- పన్నా సమీపంలో వెలుగులోకి
- 26.11 క్యారెట్ల వజ్రం గుర్తింపు
- ప్రభుత్వ రాయల్టీ పోను మిగిలినది వ్యాపారికి
ఇటుకల బట్టీ వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తికి వజ్రం రూపంలో అదృష్టం కలిసొచ్చింది. లీజుకు తీసుకున్న గని నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రం వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లా కేంద్రంలోని కిషోర్ గంజ్ నివాసి అయిన సుశీల్ శుక్లా ఒకవైపు ఇటుక బట్టీ వ్యాపారం చేస్తూనే, మరోవైపు కృష్ణ కల్యాణ్ పూర్ ప్రాంతంలో గనిని లీజుకు తీసుకున్నాడు.
సోమవారం గని తవ్వకాల నుంచి బయటపడిన 26.11 క్యారెట్ల వజ్రం విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని వేలం వేసి, విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని మినహాయించుకుని.. మిగిలినది ఇస్తామని అధికారులు ప్రకటించారు.
తాను, తన కుటుంబం 20 ఏళ్ల నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నా, ఇంత పెద్ద వజ్రాన్ని ఏ రోజూ చూడలేదని శుక్లా తెలిపాడు. మరో ఐదుగురు భాగస్వాములతో కలసి చేస్తున్న మైనింగ్ ఎట్టకేలకు అతడి కష్టానికి తగ్గ ఫలితాన్నిచ్చింది.